నూతన సెక్రటేరియట్‌లో వెనుక భాగంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద స్థలాన్ని ఫైర్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అగ్నిప్రమాదం కాదని అధికారులు తెలిపారు.
కేవలం అది మాక్ డ్రిల్ మాత్రమేనని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు సెక్రటేరియట్ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ అని చెప్పడం గమనార్హం. అగ్ని ప్రమాద సమయంలో సచివాలయ భవనంలో పొగలు దట్టంగా వెలువడ్డాయి. పొగలతో సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.
అంతకు ముందు కొత్త సచివాలయంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సచివాలయ గుమ్మటంపై పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సచివాలయానికి చేరుకున్నారు. మొత్తం 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సచివాలయంలో వుడ్ వర్క్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మంటలు వచ్చినట్టు సమాచారం.