– ప్రారంభానికి ముందే సచివాలయంలో మంటలు
– మాక్ డ్రిల్ అంటున్న అధికారులు
– లేదు.. అగ్నిప్రమాదమేనంటున్న ప్రతిపక్షాలు
– మాక్ డ్రిల్ అయితే.. అధికారికంగా చేసుకోవచ్చుగా..!
– తెల్లవారుజామున చేయడమేంటి..?
– నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలున్నాయి?
– నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!
– సీఎం తొందరపాటు వల్లే ఈ ప్రమాదం
– ప్రభుత్వంపై విపక్ష నేతల ఆగ్రహం
– ఇంతకీ ఇది ప్రమాదమా? కవరింగా..?
ఈనెల 17న తెలంగాణ కొత్త సెక్రెటేరియట్ ప్రారంభం కానుంది. దీనికోసం ఓవైపు పనులు చకచకా జరుగుతుంటే.. ఇంకోవైపు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. శుక్రవారం తెల్లవారుజామున సచివాలయంలో నుంచి మంటలు, పొగ ఉవ్వెత్తున ఎగిసిపడడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని ప్రచారం సాగింది. గుమ్మటంపై భారీగా పొగలు వ్యాపించాయి.
లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సచివాలయంలో వుడ్ వర్క్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మంటలు వచ్చినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. ఇది అగ్నిప్రమాదం కాదని.. మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారని, అందులో భాగంగా మంటలు వచ్చాయంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 5, 6వ అంతస్తుల్లో మాక్ డ్రిల్ జరిపినట్లు చెబుతున్నారు.
అయితే.. మాక్ డ్రిల్ నిర్వహిస్తే భారీగా మంటలు ఎలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లోర్లకు ఎందుకు వ్యాపిస్తాయని అంటున్నారు. అగ్నిప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.