కొందమంది మనుషులు ఎంత భయంకరంగా ఆలోచిస్తారో, ఎదుటి వారు బాధ పడుతుంటే చూసి ఎంత ఆనందిస్తారో అన్నదానికి అద్దంపట్టే ఘటన ఇది. తన తల్లిమీద కోపంతో దారుణానికి పాల్పడింది. కొన్నాళ్లుగా తిరుపతి శానంబంట్ల గ్రామంలో వరుసగా ఇళ్లకు మంటలు అంటుకుంటున్నాయి. తరచూ అగ్నిప్రమాదాలు జరగుతుండడంతో గ్రామాన్ని ఏదో దుష్టశక్తి ఆవహించిందని అంతా అనుకుంటూ వచ్చారు. కొన్ని బలులు కూడా ఇచ్చారు. ఈ భయానక పరిస్థితులు పోలీసులకు తలనొప్పిగా మారాయి.
అయితే ఈ విషయం మీద ఫోకస్ పెట్టిన పోలీసులు మొత్తానికి కీలక వ్యక్తిని పట్టుకున్నారు. ఈ మంటల వెనుక మాయ లేడీ ఉందని తేల్చారు. ఏఎస్పీ వెంకటరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఈ మంటల వెనుక మతలబు ఏంటో వివరించారు. కీర్తి అనే యువతే ప్రధాన కారణం అని వెల్లడించారు. తన తల్లి ప్రవర్తన నచ్చకనే యువతి ఈ పని చేసిందట. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి తల్లితో పాటు ఊరు వదిలి వెళ్లే అవకాశం వస్తుందని భావించి ఇలా చేసిందని గుర్తించారు పోలీసులు.
తన తల్లి ప్రవర్తనలో మార్పు కోసమే ఇలా చేసిందట. శానంబట్లలో మొత్తం 12 అగ్ని ప్రమాద ఘటనలకు పాల్పడింది కీర్తి. అంతేకాదు.. గ్రామంలోని కొందరితో ఉన్న గొడవల కారణంగా వారి ఇళ్లల్లోనూ మంటలు పెట్టిందని గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికను చూస్తే.. మంటల వెనుక ఎలాంటి రసాయనాలు లేవని తేలింది. అయితే, కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించిందని ఏఎస్పీ వెల్లడించారు.
అగ్గి పెట్టెతోనే తాను మంట పెట్టినట్లు ఒప్పుకుంది కీర్తి. ఆమె వద్ద నుంచి రూ. 32 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఏఎస్పీ. ఇందులో ఎలాంటి మూఢ నమ్మకాలు లేవని స్పష్టం చేశారు. చంద్రగిరి మండలంలోని శానంబట్ల..తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.
అధికారులు సైతం విస్తుపోతుండే వారు. అసలేం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్నారు. ఈమెగారు చేసిన పనికి శానంభట్లో మంత్రగాళ్ల హడావుడి, క్షుద్ర పూజలు, బలులులాంటి హంగామా కూడా నడిచిందని సమాచారం. మొత్తానికి ఆమె కృతకమైన ఆలోచన, చేష్టలూ బయటపడ్డాయి.