సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాల్పుల కలకలం రేగింది. అక్కన్న పేటలోని దేవుని సదానందం, గుంటి గంగరాజు కుటుంబాల మధ్య మూడు రోజుల క్రితం ప్రహరి గోడ విషయంలో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆ తర్వాత గొడవ సద్దుమణిగినప్పటికీ ఈ విషయంలో ఆవేశంతో ఉన్న సదానందం శుక్రవారం ఏకే-47 గన్ తో గంగరాజు ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపగా గంగరాజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. కాల్పుల అనంతరం సదానందం గన్ తో ఊర్లో నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సదానందం కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సదానందం ఇంట్లో తనిఖీలు చేయగా రెండు కత్తులు దొరికాయి. సదానందం కు ఏకే-47 ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సదానందం కోసం గాలిస్తున్నారు.