కెనడాలో ఓ దుండగుడు కాల్పుల కలకలం సృష్టించాడు. టొరంటో నగరంలోని సబ్‌వే స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం తుపాకీతో రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కార్తీక్ వాసు దేవ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న పారామెడికల్ సిబ్బంది ఒకరు వాసుదేవ్‌కు వైద్య సహాయం అందించారు. తర్వాత వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడు కార్తీక్ వాసుదేవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వాసుదేవ్ సెనెకా కాలేజీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. ఉద్యోగం కోసం బయటకెళ్లినప్పుడు కాల్పుల్లో అతడు మరణించినట్లు వాసుదేవ్ బ్రదర్ తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనే వాసుదేవ్ కెనడాకు వెళ్లాడు.
ఈ మేరకు టొరొంటో పోలీసు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం టొరొంటో పోలీస్ సర్వీస్ హోమిసైడ్ విభాగం ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. ఇక, ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. కాల్పుల తాలూకు సీసీటీవీ ఫుటేజీ ఏదైనా ఉంటే తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్తీక్ వాసుదేశ్ మృతి పట్ల సెనెకా కాలేజీ యాజమాన్యం కూడా సంతాపం వ్యక్తి చేసింది. ఇది ఎంతో విచారకమంటూ ప్రకటన విడుదల చేసింది. ఇక, వాసుదేవ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఓ నల్లజాతీయుడని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతిలో గన్నుతో అతడు హవర్డ్ వీధివైపు వెళుతూ చివరిసారిగా కనిపించినట్టు స్థానిక న్యూస్ ఛానెల్ పేర్కొంది.
కార్తీక్ వాసుదేవ్ మృతి పట్ల భారతీయ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరొంటోలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించడం దురదృష్టకరమని, ఇది తమను చాలా బాధించిందని ట్వీట్ చేసింది.
Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022
Advertisements