కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ కింద 22 నగరాలను అభివృద్ది చేస్తోంది. వాటిలో ఆగ్రా, వారణాసి, చెన్నై, పూణె, అహ్మదాబాద్ లల్లో వచ్చే నెల నాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని, ఆయా నగరాల పౌరులకు మెరుగైన జీవన నాణ్యత, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తాయని అధికారులు వెల్లడించారు.
మిగిలిన 78 నగరాల్లో రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నట్టు ఆయన చెప్పారు.
భోపాల్, ఇండోర్, ఆగ్రా, వారణాసి, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, రాంచీ, సేలం, సూరత్, ఉదయ్‌పూర్, విశాఖపట్నం, అహ్మదాబాద్, కాకినాడ, పూణే, వెల్లూరు, పింప్రి-చించ్‌వాడ్ వంటి 22 స్మార్ట్ సిటీల్లో మార్చి నాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.
ఆయా నగరాల్లో ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నందున తాము మార్చి నాటికి 22 స్మార్ట్ సిటీలను పూర్తి చేస్తామన్నారు. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో మిగిలిన నగరాల ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 25 జూన్ 2015న మోడీ సర్కార్ ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద 100 నగరాలను ఎంపిక చేసి వాటిని మొత్తం నాలుగు రౌండ్లలో పునరాభివృద్ది చేస్తున్నారు.