ఇటీవల కాలంలో యువకులు డ్రగ్స్ కల్చర్ కు విపరీతంగా అలవాటు పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటీకి ఏదో ఒకచోట అక్రమార్కులు గుట్టుగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు. అయితే, వాటి కారణంగా ఎంతోమంది జీవితాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు డ్రగ్స్ కి బానిసై ప్రాణాలొదిలాడు. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి గోవాకి వెళ్లి డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అతిగా డ్రగ్స్ తీసుకోవటంతో కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. దీంతో హైదరాబాద్ లో డ్రగ్స్ కారణంగా మరణించిన తొలి కేసుగా ఇది నిలిచిందని చెబుతున్నారు.
ఈ ఘటనపై అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి గోవాలో మల్టిపుల్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. డ్రగ్స్ వాడటం చట్టపరంగా నేరమని, అమ్మిన, కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అతిగా డ్రగ్స్ తీసుకుంటే చనిపోతారని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇక ఇదే ఘటనపై టీజేఏసీ కోఆర్డినేటర్ వేణు స్పందించారు. డ్రగ్స్ మాఫియా కోరల్లో చిక్కుకొని ఎంతోమంది బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యార్థి మృతికి పూర్తి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలని డిమాండ్ చేశారు. అలాగే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.