రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి పేరుకు తగ్గట్టే దివిసీమ ప్రజలకు ప్రాణదాతలా మారింది. ఇప్పటికే ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలతో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఈ హాస్పిటల్.. ఇప్పుడు మరో ఘనతను సాధించింది. కొంతకాలం క్రితమే ఇక్కడ ప్రసూతి సేవలు కూడా అందుబాటులోకి రాగా.. తాజాగా తొలి పురుడు కూడా పోసి తన సామాజిక సేవల ప్రస్థానంలో మరో మైలురాయిని ఖాతాలో వేసుకుంది రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. డాక్టర్ కోటేశ్వరీ ఆధ్వర్యంలోని వైద్యబృందం..ఆస్పత్రిలో విజయవంతంగా మొదటి డెలివరీని చేసింది.
మాతృత్వం ఓ వరం. కాన్పు అంటే ఏ స్త్రీకైనా ఉండే భయాలు అన్నీ ఇన్నీకావు. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపం క్షేమంగా బయటకు రావాలని ఆ తల్లి వేయి దేవుళ్లకు మొక్కుకుంటుంది. కోటి ప్రార్థనలు చేస్తుంది. ఇక డెలివరీ సవ్యంగా జరగాలని.. తమ తహతుకు మించి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి.. బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడే వారు నిత్యం ఎంతో మంది. కానీ దివిసీమ ప్రజలకు ఆ ప్రహసనం తప్పింది. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో తాజాగా ప్రసూతి సేవలు కూడా అందుబాటులోకి రావడంతో గర్బిణీలకు ఇక నిశ్చింత దొరికింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దివి సీమ ప్రజల కోసం టీవీ 9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్, మరికొందరి సారథ్యంలో రూ. 50 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటైంది సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకల సామర్థ్యంతో 2018 నుంచి ఉచితంగా సేవలు అందిస్తూ వారికి ఓ వరంగా మారింది. గత విజయదశమి రోజు 10 పడకలతో కూడిన ICUని కూడా అందుబాటులోకి తెచ్చారు. రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి.. కేవలం పేరులోనే కాదు తమ పాలిటి నిజమైన సంజీవని అని దీవిసీమ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు.