మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్ స్టేషన్లలో భాగంగా ఈ రోజు (శనివారం)తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందు కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి చెప్పారు. అయితే కేంద్రం దిశ చట్టంపై కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి అనుమానాల నివృత్తి కోసం క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరిందని, వాటన్నింటికీ సమాధానం పంపించామని వెల్లడించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను డీజీపీ గౌతం సవాంగ్ బుధవారమే పరిశీలించారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు, 38 మంది కానిస్టేబుళ్లతో సహా పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా చూస్తామన్నారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రవేశపెడతామని చెప్పారు. దీని ద్వారా బయట ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.