దేశంలో తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైలు టన్నెల్స్ ను నిర్మించేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది. తూర్పు అసోంలో బ్రహ్మపుత్ర నది మీదుగా రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)తో కలిసి ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు సొరంగాలు(టన్నెల్స్)ను నిర్మించనున్నట్టు తెలిపాయి.
వీటిలో ఒక దాన్ని రోడ్డు మార్గం కోసం ఏర్పాటు చేస్తుండగా, మరో దాన్ని రైలు మార్గం కోసం నిర్మిస్తున్నారు. మూడవ దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ మూడు టెన్నెల్స్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయని వెల్లడించాయి.
ప్రతి సొరంగం 9.8 కిలోమీటర్ల పొడవు ఉంటుందని వివరించాయి. పౌర అవసరాల కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తామని చెప్పాయి. ప్రస్తుతం ఉన్న కలియాబోమోర (తేజ్‌పూర్) రహదారి వంతెనకు దాదాపు 9 కి.మీ ఎగువ నుండి ఇవి ప్రారంభం అవుతాయని పేర్కొన్నాయి. ఇవి బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న ధలియాబిల్ రైల్వే స్టేషన్, దక్షిణ ఒడ్డున ఉన్న జఖ్లబంధ రైల్వే స్టేషన్ మధ్య అనుసంధాన బిందువుగా పనిచేస్తాయని చెప్పాయి.