భారత వాయుసేన 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వార్షికోత్సవ కార్యక్రమం చండీగఢ్‌లో ప్రారంభమైంది. తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని దేశ రాజధానికి అవతల నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్రపతితో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పొల్గొంటారు. వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన పరేడ్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు….
వాయుసేనలో కొత్త ఆయుధ వ్యవస్థ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థతో ఎయిర్ ఫోర్స్ కు రూ.3,400 కోట్ల వరకు వ్యయం తగ్గుతుందని ఆయన వివరించారు. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత వాయుసేనను అత్యంత పటిష్ఠంగా మార్చే బాధ్యత తమపై ఉందన్నారు.
అంతకుముందు జాతీయ యుద్ధస్మారకాన్ని సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు సందర్శించారు. ఇటీవల తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా యోధులను భారత వాయుసేనలోకి చేర్చుకోవడం సవాళ్లతో కూడుకున్న అంశమన్నారు.
దేశసేవకు యువత సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు మనకు లభించిన అద్భుతమైన అవకాశం ఇదన్నారు. అగ్నివీరులకు సరైన నైపుణ్యం, నాలెడ్జ్ అందించే విధంగా ఆపరేషనల్ శిక్షణా విధానంలో మార్పులు తీసుకు వచ్చామన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో 3వేల మందిని నియమించి ప్రాథమిక శిక్షణ ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏడాది మహిళా అగ్నివీరులను సైతం నియమిస్తామని అన్నారు.
మరోవైపు వాయుసేన వార్షికోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వాయుసేన పోరాట యోధులందరికీ ఆయన శుభాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా అసాధారణ నైపుణ్యాలను ఎయిర్ ఫోర్స్ ప్రదర్శించిందన్నారు. ఓ వైపు దేశాన్ని ఎల్లప్పుడూ రక్షించడమే కాకుండా.. విపత్తుల సమయంలో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందన్నారు.