అనుకున్నట్టుగానే బిహార్‌లో కుల గణనను మహాఘట బంధన్ సర్కార్ చేపట్టింది. కుల గణనపై కేంద్రం మౌనం వీడక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో నేటి నుంచి కులాల వారీగా జనగణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో ఈ కులగణన కొనసాగనుంది. రెండు దశల్లో ఈ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కులగణనలో భాగంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి లాంటి వివరాలను ప్రజల నుంచి సేకరించనున్నారు.
ఈ ప్రక్రియ మొత్తం మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ విధానంలో జరుగనున్నది. ఇందులో ప్రధానంగా ఓబీసీల స్థితిగతులను ప్రస్తావించనున్నారు. ఈ ప్రక్రియం కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం రూ. 500 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. మొదటి దశ గుర్తింపు ప్రక్రియ నేటి నుంచి మొదలైంది.
మొదటి దశ లెక్కింపు ఈ నెల 21 వరకు కొనసాగనుంది. రెండో దశ లెక్కింపును ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో నేటి నుంచి మొదటి దశ కుల జనగణన ప్రారంభమవుతుందని వెల్లడించారు.
దీనిద్వారా ప్రభుత్వానికి శాస్త్రీయ గణాంకాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరేలా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. రెండు విడుతల్లో గణన కొనసాగుతుందన్నారు. జనవరి 21న మొదటి దశ, ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రెండో విడత సర్వే జరుగనుందని చెప్పారు.