ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎదరుపడేది చాలా అరుదు. మాములుగా అసెంబ్లీలో మాత్రమే ఒకరినొకరు ఫేస్ చేసే అవకాశం ఉంది. అదీగాక రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం వంటి కార్యక్రమానికి హాజరైతే ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే చాన్స్ ఉంది. అయితే ఈ రెండు కాకుండా వారు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశాలు దాదాపుగా లేవు. కానీ తాజాగా ఆ రెండూ కానీ సందర్భం ఒకటి వచ్చింది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యుల నియామకం కోసం ఈ నెల 17న అత్యున్నత కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం జగన్, శాసనసభ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు శాసనసభ స్పీకర్ తమ్మినేని, శాసన మండలి చైర్మన్ షరీఫ్, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల, హోం మంత్రి హాజరవుతారు..అంటే మొత్తం ఆరుగురు సమావేశమయ్యే ఈ కమిటీలో ముగ్గురు వైసీపీకి చెందిన వారు.. ముగ్గురు టీడీపీ నేతలు ఉన్నారు. అందరూ కలిసి మానవహక్కుల కమిటీని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈ భేటీ అనివార్యం కావడంతో.. ఆరోజు ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మానవహక్కుల కమిటీ చైర్మన్, సభ్యుల ఎంపికపై ప్రభుత్వ ప్రతిపాదనలకు ప్రతిపక్షం ఒకే చెప్తుందా లేదా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఇరువైపులా సమాన బలం ఉంది. దీంతో ఆ రోజు ఈ ఇష్యూ కొలిక్కి వస్తుందా లేక వాయిదా పడుతుందా అన్నదానిపై ఇప్పటినుంచే చర్చలు జరుగుతున్నాయి.