కఠినమైన శిక్షణ, నిర్విరామ కృషి, అంతకు మించిన పట్టుదల వెరసి మహిళా కెప్టెన్ శివ చౌహాన్. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియాచిన్ లో విధులు నిర్వహించేందుకు అర్హత సాధించిన తొలి మహిళా కెప్టెన్ గా ఘనత సాధించారు శివచౌహాన్. దేశ రక్షణే ధ్యేయంగా ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కు చెందిన శివ సియాచిన్ హిమనీ నదంలోని కుమార్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు.వీరి నియామకంపై ప్రకటన చేసిన ఫైర్ అండ్ ఫ్యూరీకార్ప్స్..ట్విట్టర్లో సంబంధిత ఫోటోలు విడుదల చేసింది.
సియాచిన్ 15,632 వేల అడుగుల ఎత్తులో కుమార్ పోస్ట్ ఉంది. ఎముకలు కొరికే చలి, శ్వాశ కూడా ఆడని దుస్థితిగల వాతావరణం. ఇదే పరిస్థితి ఇక్కడ 356 రోజులూ ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేని మంచు, ఈ మంచులో ఎక్కడ కూరుకుపోతామో తెలియని భయానక పరిస్థితులు ఉంటాయి.
ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా పురుషులకు ధీటుగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు శివ చౌహాన్. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వీరి తెగువ, ధైర్యం చూసి ఈ ప్రాంతంలో నియమించారు. ట్విట్టర్లో సంబంధిత ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘అన్ని అడ్డంకులను బద్దలు కొడదాం’ అనే క్యాప్షన్ పెట్టారు ఆర్మీ ఉన్నతాధికారులు.
హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణిలో సియాచిన్ హిమనీనదం ఉంది. భారత- పాక్ మధ్య నియంత్రణ రేఖ ఈ ప్రాంతం వద్దే ముగుస్తుంది. లాద్దాఖ్ లో ఉన్న ఈ ప్రాంతంలోనే 1984 లో దాయాది పాక్ తో యుద్ధం జరిగింది. ప్రస్తుతం సియాచిన్ ప్రాంతమంతా భారత్ అధీరంలోనే ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం.