కర్నాటకలోని మాండ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళతో పాటు.. 12 ఏళ్ల లోపున్న నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని పరారయిట్టు గుర్తించారు పోలీసులు. మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని కేఆర్‌ఎస్ సమీపంలోని బజార్ లైన్ లో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మి , గంగారాం దంపతులు శ్రీరంగ పట్టణంలో నివాసం ఉంటున్నారు. గంగారాం.. అతడి సోదరుడు గణేష్ తో కలిసి.. ప్లాస్టిక్ అలంకరణ సామగ్రి వస్తువులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తుంటారు. ఒక్కోసారి తిరిగివచ్చేందుకు 15 నుండి 30 రోజులు పడుతోంది.
గంగారాం రెండు రోజులుగా ఊళ్లో లేడు. వ్యాపారంలో భాగంగా పొరుగు ఊర్లకు వెళ్లాడు. అతను లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఘాతుకానికి తెగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
శనివారం రాత్రి భర్త ఇంట్లో లేకపోవడంతో పిల్లలతో కలిసి నిద్రిస్తోంది లక్ష్మి. ఈ సమయంలో దుండగులు మారణాయుధాలతో దాడిచేసి హత్య చేశారు. మృతుల్లో లక్ష్మి (30) తోపాటు.. రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్(12) ఉన్నట్టు పోలీసులు తెలిపారు.