దేశంలో మరో కొవిడ్ వేరియంట్ కలకలం రేపింది. కరోనా వైరస్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 భారత్ లోనూ వెలుగు చూసింది. ఈ వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
దేళంలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్) వెల్లడించింది. గుజరాత్లో మూడు, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వివరించారు. దీంతో కేంద్రం అలర్ట్ అయింది.
ఒమిక్రాన్‌కు సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 వల్ల అగ్ర రాజ్యం అమెరికాలో 40.5 శాతం కేసులు పెరిగాయి. ఇంగ్లాండ్, న్యూయార్క్‌లో ఏకంగా 75 శాతం కేసులు ఈ సబ్ వేరియంట్ వల్ల పెరిగినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీఏ.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నుంచి ఎక్స్‌బీబీ ఉద్భవించినట్టు వెల్లడించారు.
తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఎక్స్‌బీబీ 1.5 ఉపరకం ప్రభావం భారత్ పై అంతగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశంలో 80 శాతానికిపైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందింది. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ 1.5 సబ్ వేరియంట్లను మొదట భారత్‌లోనే గుర్తించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎం.వాలి తెలిపారు.
చాలాచోట్ల ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కొన్నిచోట్ల 5 నుంచి 7 రెట్లు, మరికొన్నిచోట్ల 18 రెట్లు వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 150 రెట్లు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోందన్నారు. కానీ భారత్‌లో ఇదే పరిస్థితి ఉంటుందని భావించలేమన్నారు.
ఇక్కడ 80 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారన్నారు. అందువల్ల మెరుగైన రోగ నిరోధక శక్తి సాధించామన్నారు. 40 శాతానికిపైగా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని చెప్పారు. ఈ కారణంగా చైనా, అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చన్నారు.