హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకదాని నుంచి తేరుకోకముందే ఇంకోటి జరుగుతూ.. నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ లో ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ మాల్ అగ్ని ప్రమాద ఘటన ఇంకా చల్లారక ముందే.. శనివారం రాత్రి నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
తాజాగా ఆదివారం హకీంపేటలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హకీంపేట్ సాలార్జంగ్ బ్రిడ్జ్ ఏరియాలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. వెల్డింగ్ వర్క్ నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఐదు సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలు చూసి.. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పరుగులు తీశారు.
స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ మార్గంలో కాసేపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కాగా ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినద్దీన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా పెద్ద సిలిండర్ నుంచి చిన్న వాటిలోకి గ్యాస్ నింపుతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.