కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే.. కెనడాలోని ఒంటారియో హైవేపై వెళ్తున్న ఓ పాసింజర్ వ్యాన్, అదుపు తప్పి ట్రాలీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని భారత రాయబారి అజయ్ బిసారియా ట్విట్టర్లో తెలిపారు.
మృతులను హర్ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలియజేసినట్లు వెల్లడించారు అజయ్.