ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల దగ్గర గ్రానైట్ లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తోన్న ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కొని మృతి చెందాడు. ఆటో డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీసేందుకు అర్ధగంటపాటు సిబ్బంది శ్రమించారు. నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
మృతులు మేక బాబు, నర్సయ్య, గడ్డం అంజయ్య, శేఖర్, పాలెయ్యగా గుర్తించారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారని తెలియడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అలాగే మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారు కూలీలు అని .. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.