పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వరుస మిస్టరీ మరణాలపై ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చకు దిగారు టీడీపీ నేతలు. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు. వెల్ లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జంగారెడ్డి గూడెం వరుస మరణాలపై సభలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటన చేస్తుండగా.. టీడీపీ సభ్యులు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సీనియర్ సభ్యులు ఇంత మంది ఉండి.. సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
ఈ క్రమంలో స్పీకర్ పోడియం చుట్టూ చేరి పేపర్లు చించి ఎగురవేశారు తెలుగుదేశం పార్టీ సభ్యులు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అన్నారు స్పీకర్.
సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, డీబీవీ స్వామి లు ఉన్నారు. సస్పెన్షన్ అనంతరం మార్షల్స్ రంగ ప్రవేశం చేసి.. వారిని బయటకు తీసుకెళ్లారు.