గర్భిణీగా ఉన్న సమయంలో ఆడవాళ్ళు రెండు అడుగులేస్తే చాలు ఆయాసపడిపోతుంటారు. కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కంగారుపడుతుంటారు.ఐదు నెలల గర్భిణి…తనలో తాను మాట్లాడుకుంటూ, మాటల్లో చెప్పలేనిది ఏదో అన్వేషించుకుంటూ బిహార్ నుంచి భీమదేవరపల్లి మండలానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ బస్టాండ్ లో మతిస్థిమితం లేని ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ యువతి(26) రెండు రోజులుగా ఉంటుంది.
ఇది గమనించిన స్థానికులు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కి సమాచారం ఇవ్వగా సర్పంచ్ భర్త మధుసూదన్ రెడ్డి యువతికి షెల్టర్ తోపాటు భోజనం ఏర్పాటు చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు యువతితో మాట్లాడే ప్రయత్నం చేయగా తన పేరు కుష్బూ అని, అమ్మానాన్నలు ఇంటి నుండి వెళ్లగొట్టారని, తనది లక్ష్మీపూర్ గ్రామమని బీహార్ భాషలో తెలిపింది. తదుపరి యువతి వివరాలు ఏం చెప్పలేకపోతోంది. మండల సీడీపీఓ స్వరూప ఆమెను జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు.