సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి పులిగోరు వెంకట సంజయ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన మణిపూర్ హైకోర్టు సీజేఐగా పని చేశారు. గతేడాది డిసెంబర్ 13న సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జస్టిస్ సంజయ్ తో పాటు మరో నలుగురిి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది.
గతనెల 31న మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. మొదట పంపిన జాబితాలో న్యాయమూర్తుల నియామక ప్రకటనను ముందుగా విడుదల చేయాల్సిన విషయాన్ని కేంద్రానికి కొలీజియం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే వీరి నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
జస్టిస్ సంజయ్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ప్రమాణం చేశారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. తాజాగా వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
జస్టిస్ సంజయ్ కుమార్ గతంలో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్.
ఆయన తండ్రి పీ.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్ సంజయ్‌కుమార్ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం చదివారు.
1988లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆయన ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.