కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు.. కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా పరిధిలోని మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మృతులంతా నిజామాబాద్ జిల్లా కుమ్మరిపల్లికి చెందనివారిగా పోలీసులు గుర్తించారు. సర్వేయర్ రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి నుండి కరీంనగర్ వైపు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తోంది.
మార్గమధ్యంలో ఘన్ పూర్ వద్ద ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రాధాకృష్ణ అతని భార్య కల్పన, కుమారుడు శ్రీరామ్, వృద్ధురాలు సువర్ణ, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఇంకొక బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. రన్నింగ్ లో ఉన్న బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.