– ఏజెంట్ మోసానికి బలైన యువకులు
– పని కోసం దుబాయ్ వెళ్లి అవస్థలు
– తాగి గొడవ చేశారని కేసులు నమోదు
– ఎయిర్ పోర్ట్ లో ఆపేసిన పోలీసులు
ఎక్కువ జీతం అంటే నమ్మేశారు. కష్టాలు తొలగిపోతాయని ఎన్నో కలలు కన్నారు. కానీ, ఏంజెట్ల మోసానికి ఐదుగురు యువకులు బలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవింద్, స్వామి, అనిల్, రాములుతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ దుబాయ్ వెళ్లారు. ఓ కంపెనీ సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించింది. కానీ, ఇండియాలో చెప్పిన పని, జీతం అక్కడ ఇవ్వలేదు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులను ఐదుగురు యువకులు నిలదీశారు.
పోలీసులను పిలిపించిన కంపెనీ ప్రతినిధులు తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. యువకులు ఎంత చెప్పినా వినలేదు. ఇండియా నుంచి టికెట్ తెప్పించుకోండి మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు. ఎలాగోలా ఇంటి దగ్గర నుంచి టికెట్లు తెప్పించుకున్నారు. కంపెనీ కూడా పాస్ పోర్టులు ఇచ్చి వదిలేసింది. శనివారం రాత్రి దుబాయ్ నుండి ఇండియాకి రావలసి ఉంది.
ఐదుగురు టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. బోర్డింగ్ పాస్ కూడా పూర్తయింది. కానీ, అంతలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. చెక్ చేసి.. మీపై కేసులు ఉన్నాయి ఇండియాకి వెళ్లరాదని చెప్పి బయటకు పంపించారు. యువకులు సదరు ఏజెంట్లకు, కంపెనీకి ఫోన్ చేయగా ఎవరూ స్పందించడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఎయిర్ పోర్ట్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.
ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వివరించారు. తాగడానికి నీళ్లు తినడానికి తిండి లేదని వాపోయారు. దీంతో కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారిని వెంటనే ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు.