– ఆసక్తిరంగా మారిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు
– గతపాలన కాలంనాటి అంశాలు తెరపైకి
– విమర్శలే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని ప్రచారం చేస్తున్న పార్టీలు
– గెలుపుకోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు
దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీ.. శాంతి భద్రతల పరిరక్షణనే తమ ప్రభుత్వ ప్రధాన విజయంగా చెప్తోంది. అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా కొన్ని ప్రతికూలతలనూ ఎదుర్కొంటోంది.
నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలను విపక్ష సమాజ్ వాదీ పార్టీ ప్రచార అస్త్రాలుగా మలచుకొన్న పరిస్థితుల్లో.. తన ఆయుధాలకు కమలదళం పదనుపెట్టింది. అయితే.. శాంతి భద్రతలను కాపాడటం కోసం యోగి సర్కారు చేపట్టిన కఠిన చర్యలపై రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని ఈ అంశం ఎంత మేరకు తగ్గిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని ఓడించి బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. గూండాలను అణచివేయాలంటే ఏనుగు గుర్తుకు ఓటెయ్యండి అని బహుజన సమాజ్ పార్టీ ఆ ఎన్నికల్లో ప్రజలకు చెప్తూ.. ప్రచారం చేసింది. కానీ.. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ అనేక ఆరోపణలను మోసింది. అధికారంలో ఉన్నా, లేకున్నా నేరగాళ్లతో బలమైన సంబంధాలతో ఉంటోందనేది ప్రధాన ఆరోపణ.
2016 మార్చి 12న డాలీబాగ్ లో పోలీస్ ఔట్‌పోస్టుకు సమీపంలో ఓ ఎస్పీ నాయకుడు తన వాహనాన్ని నో పార్కింగ్ ప్లేస్ లో నిలిపారు. దానికి అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ నాయకుడు ఆగ్రహంతో కానిస్టేబుల్ ను దూషిస్తూ..అతనిని వాహనం బానెట్ పైకి విసరి డాలీబాగ్ అంతటా తిప్పాడు. సమాజ్ వాదీ నాయకుడికి ఎదురు చెబితే ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. అప్పట్టో సంచలనంగా నిలిచిన ఈ ఘటనపై అప్పటి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న చర్య మరింత విస్మయం కలిగించింది.
అయితే.. దురుసుగా ప్రవర్తించిన నాయకుడిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా కానిస్టేబుల్ ను మరో ప్రాంతానికి బదిలీ చేసింది. సమాజ్ వాదీ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజాగ్రహమే 2017లో బీజేపీని భారీ ఆధిక్యంతో గెలిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఎస్పీ జెండాతో తిరిగే ప్రతి వాహనంలో గూండాలు తప్పనిసరిగా ఉంటారు అని ఆ ఎన్నికల్లో కమలనాథులు చేసిన విమర్శ ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.
అయితే.. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పలు ఘటనలను ఇప్పుడు జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ పదేపదే ప్రజలకు గుర్తు చేస్తోంది. సురక్ష నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. గ్రామాల్లోని వారు తమ పశువులు, వస్తువులు చోరీ కాకుండా రక్షణ కావాలని కోరుకుంటున్నారని.. పట్టణాల్లోని ఉన్నత కులాల వారికి తమ మహిళల భద్రత ప్రధాన అంశం అనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది.
వీధివ్యాపారులు, ఆటోరిక్షా డ్రైవర్లు తదితరులకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఆవరణలో బలవంతపు వసూళ్ల నుంచి రక్షణ కావాలంటూ తమ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు కమలనాథులు. అయితే.. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆదిత్యనాథ్ పాలనలో బందిపోటు ఘటనలు 72శాతం, దోపిడీలు 62శాతం, హత్యలు 31శాతం, అత్యాచారాలు 50 శాతం తగ్గిపోయాయని అధికారిక రికార్డుల్లో పేర్కొనబడింది.