ఐక్యరాజ్య సమితి అధికారులు కిడ్నాప్ కలకలం రేపుతోంది. దక్షిణ యెమెన్ లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని అల్ ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు యెమన్ అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం అర్థరాత్రి వారిని కిడ్నాప్ చేసి.. దక్షిణ ప్రావిన్స్ అబ్యాన్ లోని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కిడ్నాప్ కు గురైన వారిలో నలుగురు యెమన్ దేశస్థులు కాగా.. ఒకరు విదేశీయుడు ఉన్నారని తెలిపారు. కాగా.. ఈ వ్యవహారంపై తమకు సమాచారం అందిందన్న ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కానీ.. కిడ్నాప్ కు సంబంధించి యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగుల విడుదల కోసం కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నామని దేశ గిరిజన నేతలు తెలిపారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వంచే జైలులో బందించబడి ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేయాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. హౌతీలు దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించారు. దీని కారణంగా అనేక ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఇక్కడ తమ పాదాలను విస్తరించాయి. ప్రజలను కిడ్నాప్ చేస్తూ నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
యెమెన్ లో సౌదీ నేతృత్వంలోని మిలటరీ కూటమి 2015 నుంచి ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో యుద్ధం చేస్తోంది. 2015లో యెమెన్ లో జరుగుతున్న యుద్ధంలో ఈ కూటమి జోక్యం చేసుకుంది. అప్పుడు హౌతీలు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించారు. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీని కారణంగా యెమెన్ లో పెద్ద మానవతా విపత్తు ఏర్పడింది.