సర్వీసు ఛార్జీల వసూళ్లపై రెస్టారెంట్లను కేంద్రం హెచ్చరించింది. సర్వీసు ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లపై రెస్టారెంట్లు ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా పరిగణించనున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ(డీవోసీఏ) తెలిపింది. సర్వీసు ఛార్జీలను కస్టమర్లు స్వచ్ఛందంగా చెల్లించినప్పుడు మాత్రమే తీసుకోవాలని రెస్టారెంట్లకు డీవోసీఏ సూచించింది.
పలు రెస్టారెంట్లు డిఫాల్ట్ గా సర్వీసు ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు వచ్చిన మీడియా రిపోర్టులు, జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్లలో అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని డీవోసీఏ ఈ మేరకు హెచ్చరికలు చేసింది.
ఈ క్రమంలో ఇండియన్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సమావేశాన్ని జూన్ 2న డీవోసీఏ షెడ్యూల్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ కు డీవోసీఏ ఓ లేఖ రాసింది. రెస్టారెంట్లు ఏకపక్షంగా నిర్ణయించిన సర్వీస్ ఛార్జీని వినియోగదారులు బలవంతంగా చెల్లించాల్సి వస్తోందని లేఖలో పేర్కొంది.
రెస్టారెంట్లు 5 నుంచి 10 శాతం మధ్య సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని లేఖలో వెల్లడించింది. ఆ ఛార్జీల చట్టబద్ధతపై వినియోగదారులను రెస్టారెంట్లు తప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నాయని వివరించింది. సర్వీసు ఛార్జీలను తొలగించాలని వినియోగదారులు డిమాండ్ చేసినప్పుడు వారిని రెస్టారెంట్లు వేధింపులకు గురి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అలాంటి రెస్టారెంట్లపై చర్యలు తీసుకోనున్నట్టు చెప్పింది.