ఒకే ఒక్క ప్లెక్సీ.. ప్రజల్ని భయంతో వణికిపోయేలా చేసింది. ఎప్పుడొచ్చి ఎవరు చంపేస్తారోనని గడప దాటనివ్వలేదు. అందులో ఉన్న బెదిరింపులు అలాంటివి మరి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ లో వెలిసిన ఫ్లెక్సీ స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్ లో నెల రోజుల క్రితం ముగ్గుర్ని దారుణంగా హత్య చేశారు. మంత్రాల నెపంతో నాగేశ్వరరావు, అతని కుమారులు రమేష్, రాంబాబును అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేశారు. ఈ ముగ్గురు మంత్రాలతో గ్రామస్తులను అనారోగ్యానికి గురిచేస్తున్నారని కుల సంఘం సమావేశం నిర్వహించగా.. అదే సమయంలో ఇరువర్గాల మధ్య గొడవ పెద్దదై హత్యలకు దారి తీసింది.
ఆనాటి ఘటనను మరువకముందే అలాంటిదే పునరావృతం అవుతుందంటూ రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ లో ఫ్లెక్సీ వెలిసింది. 8 మందిని హతమారుస్తామంటూ అందులో ఉంది. దీంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గ్రామంలో 8 మంది మాంత్రికులు ఉన్నారని.. వారు తీరు మార్చుకోకపోతే చంపుతామని ఫ్లెక్సీలో హెచ్చరించారు దుండగులు.
విషయం తెలిసిన వెంటనే జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ గ్రామసభ నిర్వహించారు. ఎవరికైనా బెదిరింపులు వచ్చినా వెంటనే సమాచారం అందించాలన్నారు. ఎనిమిది మంది తమకు ప్రాణభయం ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.