బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ బీఆర్ఎస్ పాలిటిక్స్ మరో సారి హీట్ పుట్టిస్తున్నాయి. రాజాసింగ్ 1000 కోట్ల సవాల్ కు ప్రతి సవాల్ విసురుతూ..బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్.. రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.
గోషామహల్ లోని కోఠి, అబిడ్స్, MJ మార్కెట్, CBS , జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తా లలో ఈ ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్. రాజాసింగ్.. 1000 పొర్లు దండాలు పెట్టి.. 1000 కోట్లు పంచినా ఈసారి ఆయన ఓట్లు వేయరని..రాజా సింగ్ 9 ఏళ్ల లో గోషామహల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలని..హిందుత్వం, మతం పేరును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూన్నాడని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్ ఇస్తారని, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారని.. ఆ ఫ్లెక్సీల్లో ఉంది.
దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో గోషామహల్ ప్రజలు రాజాసింగ్ ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజల సమస్యల కోసం.. ఎమ్మెల్యే రాజసింగ్ ఎన్నడూ అందుబాటులో ఉండడని రాసి ఉన్న రాజాసింగ్ వ్యతిరేక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, CBS , జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో దర్శనమిస్తున్నాయి.
అయితే గోషామహల్ లో మళ్లీ తానే గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజక వర్గంలో ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవరన్నారు. బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా సరే.. చివరికి తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచి చూపిస్తానంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా ఈ ఫ్లెక్సీలు హీట్ పుట్టిస్తున్నాయి.