రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. బండి సంజయ్ ఫొటోతో పెట్టిన ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టడమేంటని బీజేపీ శ్రేణులు ధ్వజమెత్తుతున్నారు.
ఆ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం.. మరోవైపు అమ్మాయి నవ్వుతూ ఉన్న ఫొటో పెట్టారు. అయితే బండి సంజయ్ పై టీఆర్ఎస్ యూత్ నాయకులు ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు తొలగించారు.
కాగా ప్రస్తుతం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా నైట్ క్యాంప్ నుంచి ప్రారంభమయ్యింది. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కావడంతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ అందుకుంది. ముథోల్ నియోజకవర్గం, లింబ గ్రామం సమీపంలోని రాత్రి శిబిరం నుంచి పాదయాత్ర షురూ అయ్యింది.
గురువారం మొత్తం 11.1 కిలో మీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం అంబకంటి సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఇక శుక్రవారం యాధావిధిగా మళ్లీ పాదయాత్ర మొదలవుతుంది.