ఫ్లెక్సీ పొలిటిక్స్ మళ్లీ తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు మళ్లీ చించివేశారు. శనివారం తెల్లవారుజామున బిజినపల్లి నుంచి పాలెం వరకు రోడ్డు పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించి వేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తరువాత మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అభివృద్ధి చూసి ఓర్వలేక ఎలాగైనా తనని ఓడించాలన్న అక్కసుతో దళిత గిరిజనులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే మార్కండేయ లిఫ్ట్ పూర్తి చేయాలని డిమాండ్ మేరకు పైలాన్ సందర్శనకు వెళ్తేనే గుండా రాజకీయాలకు తెరలేపుతున్నాడంటూ నాగం ఎమ్మెల్యే పై ధ్వజమెత్తారు. ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. తమ గిరిజన కార్యకర్త వాల్యనాయక్, దళిత నాయకుడు రాములను తన కళ్లముందే చెప్పు కాలుతో మెడపై తొక్కి చంపాలని చూశారని ఆధారలతో సహా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా నేటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకలేదన్నారు.
దీంతో దళిత గిరిజనుల పరిస్థితి ఎలా దాపురించిందో తెలుస్తుందని గిరిజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరుపుకుంటున్నామన్నారు. దీన్ని కూడా డిస్టర్బ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులతో దొంగ చాటుగా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇక తాజాగా ఆదివారం తెల్లవారుజామున కూడా బిజినపల్లి వెలుగొండ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే గుర్తుతెలియని దుండగులు తొలగించడంపై ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తున్నారు.