తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంఘటన తెలిసిందే. డిసెంబర్ 6వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెబుతూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేయమని కోరగా కవిత హైదరాబాదులో విచారణ హాజరవుతానని ముందు సీబీఐ అధికారులకు రిప్లై ఇచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా తనను ఏ కేసులో విచారిస్తున్నారో ఆ కేసుకు సంబంధించిన ఫిర్యాదు, అలాగే కేసు కాపీలను తను అందించాలని అవి అందిన తర్వాతే తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధమవుతానని కవిత పేర్కొన్నారు. అంతేకాక ముందు అనుకున్నట్టుగా డిసెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కాలేనని, తనకు నోటీసు కాపీలు వచ్చిన తర్వాతే ఎప్పుడు హాజరవుతాను అనే విషయాన్ని వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ సందర్భంగా ఆమెకు మద్దతు పలుకుతూ తెలంగాణలోని హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్, తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా వీఆర్ విత్ యూ కవితక్క అంటూ నినాదాలతో ఫ్లెక్సీలను ప్రచురించారు. ఈ ఫ్లెక్సీలలో కేవలం కేసీఆర్, కవిత ఫోటోలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ ఫ్లెక్సీలలో ఎక్కడా కనిపించలేదు. అరవింద్ అలిశెట్టి పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి, ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీష్ సిసోడియా కేసులో కొన్ని వివరాలు కావాలని, అందుకు మీరు విచారణకు హాజరు కావాలని చెబుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే తెలివిగా ఆమె కేసు కాపీలను కోరి అవి వచ్చిన తర్వాతే తాను ఎప్పుడు విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని చెబుతాను అనడం గురించి ఇప్పుడు తెలంగాణ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక అంతకుముందే ఈ కేసులో తనను అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదని మహా అయితే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అంతకు మించి ఏమీ చేయలేరు. నన్నేమీ ఉరివేయలేరు కదా అంటూ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.