ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ముమ్మరం చేసింది. తాజాగా రొమేనియా రాజధాని బుచరెస్ట్ నుంచి 182 మంది భారతీయులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏడవ విమానం భారత్ లో ల్యాండ్ అయింది.
ఈ విమానం ముంబైలోని విమానాశ్రంయలో మంగళవారం ఉదయం 7 గంటల 40 నిమిషాలకు దిగినట్టు అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారతీయ పౌరులకు కేంద్ర మంత్రి నారాయణ రాణే స్వాగతం పలికారు.
అంతకు ముందు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ఎనిమిదవ ఫ్లైట్ 216 మందితో హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు.
మరోవైపు 218 మందితో వస్తున్న తొమ్మిదవ ఫ్లైట్ రొమేనియా రాజధాని బుచరెస్ట్ నుంచి బయలు దేరినట్టు ఆయన వెల్లడించారు. ఈ రెండు ఫ్లైట్ లు మరి కొన్ని గంటల్లో న్యూఢిల్లీకి చేరుకుంటాయని పేర్కొన్నారు.