తిరుమల కొండపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీంతో టీటీడీ అధికారులు ఆందోళనకు గురై…చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. నో ఫ్లాయింగ్ జోన్ గా తిరుమల కొండను పేర్కొన్నప్పటికీ రెండు రోజులుగా విమానం చక్కర్లు కొట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది.
తిరుమల కొండపైన దేవతలు సంచరిస్తారని.. అందుకే శ్రీవారి కొండపైన విమానాలు వెళ్లడం నిషేధంగా పండితులు పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా నివేదించింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా రెండు రోజుల నుంచి కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఛార్టెర్డ్ విమానం తిరగడంపై టీటీడీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా అలాగే విమానాలు తిరగడంతో గతంలో బ్రిటిష్ కాలంలో కూడా రెండు విమానాలు పేలినట్లు ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు. కాగా విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో చెన్నై విమానాశ్రయ అధికారులు మరోసారి విమానం పంపబోమని తెలిపారు.