బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండూస్’ తుఫాను తన పరిధిని పెంచుకుంటూ మరింత బలంగా తీరం వైపు దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ శాఖ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. మాండూస్ తుఫాన్ కారణంగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు అధికారులు రద్దు చేశారు.
అలాగే తుఫాను పరిస్థితులపై సంబంధిత శాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మాండూస్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుఫాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని ఆయన కోరారు.
కాగా ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముంది. తుఫాను కదలికలకు సంబంధించిన చిత్రాలను భారత వాతావరణ శాఖ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తోంది.
తుఫాను ప్రభావంతో రానున్న 3 గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు వైపు మాండూస్ తుఫాను దూసుకు వస్తోంది. కారైకాల్ కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.
తీరం దాటే సమయంలో 65-85 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని సూచించారు.
ఇక రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.