కరోనాతో కుదేలైపోయిన పర్యాటకరంగాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షిచేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం సముద్రం నీటిపై తేలియాడే వంతెనను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.
కర్ణాటకలోని ఉడుపిలో నీటిపై తేలియాడే వంతెనను స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్ ప్రారంభించారు. నగరంలోని మాల్పే బీచ్లో శుక్రవారం ఈ వంతెనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘుపతి మాట్లాడుతూ.. తేలియాడే వంతెన వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్లప్పుడూ 20-25 మంది గార్డ్స్ ఇక్కడ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. బీచ్ లో పర్యాటకాన్ని అభివృద్ధి పరిచేందుకు ఈ వంతెనను నిర్మించామని చెప్పారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్‌లు వేసుకుని రావాలని ఎమ్మెల్యే సూచించారు.
నీటిపై తేలియాడే బ్రిడ్జి కావడంతో టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది. సముద్రపు అలల ధాటికి బ్రిడ్జి పైకి.. కిందకి కదలాడటం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దీనిపై వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు. వంతెనపైకి వెళ్లేందుకు కేవలం 20 నుంచి 25 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలో తొలి తేలియాడే వంతెన ఇదే కావడం విశేషం. సముద్రంలో 100 మీటర్ల దూరం వరకు ఈ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లొచ్చు. ప్రస్తుతం 15 రోజులపాటు ఈ తేలియాడే బ్రిడ్జిని ట్రయల్స్ కోసం అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. కేరళలోని బేపోరేలో ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇదివరకు ఏర్పాటు చేశారు.