గోదావరి మహోగ్ర రూపం చల్లారినా.. పరివాహక గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముంపు తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరిన జనాలు పాడైపోయిన ఇళ్లు.. కొట్టుకుపోయిన వస్తువులను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ముఖ్యంగా భద్రాచలంలోని వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. వరద తగ్గి నాలుగు రోజులు దాటినా అనేక ఇళ్లు నీటి మధ్యనే ఉన్నాయి. వాటికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు.
వరదలకు అనేక జంతు కళేబరాలు కొట్టుకురావటంతో పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతోంది. వాటివల్ల అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. వరదల్లో నష్టపోయినవారి పేర్లు నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఇంటింటికీ వెళ్లి బాధితుల వివరాలు సేకరిస్తే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుంది. పునరావాస కేంద్రాల దగ్గర కౌంటర్లు పెట్టి పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఒకవైపు మునిగిపోయిన ఇళ్లను బాగు చేసుకొనే పనిలో బాధితులుంటే, వాళ్ళు స్వయంగా వస్తేనే, అదీ ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ ప్రూఫులు ఇస్తేనే పేర్లు నమోదు అంటున్నారు. ఇది అధికారుల బాధ్యతారాహిత్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. బతుకుతెరువు కోసం వచ్చి ఉంటున్న వారికి లోకల్ ప్రూఫ్ ఏముంటదనేది బాధితుల వాదన. అధికారులు ఇక్కడి ఆధార్ లేదని పేర్లు రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.
సీఎం ఎక్కడో దూరంగా వేరే మండలంలో ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు కానీ.. ఇక్కడ బతికే వారికి అంత దూరం నుంచి పనులకు రావటం కుదిరేది కాదని అంటున్నారు. దానివల్ల ఆ ఇళ్ళ కాంట్రాక్టర్లకు లాభమే తప్ప తమకు కాదని బాధితులు చెబుతున్నారు. దీనికంటే ఉన్న కరకట్ట ఎత్తు పెంచి ఇంకో కిలోమీటర్ మేర పొడవు పెంచితే ఎవరికీ ఇబ్బంది ఉండదని.. దశాబ్దాలుగా ఉంటున్న చోటును ఖాళీ చెయ్యాల్సిన పని ఉండదని వివరిస్తున్నారు.
మరోవైపు వరద నీరు ఇంట్లోకి చేరడంతో అనేక విష సర్పాలు చేరాయి. ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు బాధితులు. వర్షాల ధాటికి మట్టి ఇళ్లు పూర్తిగా నానిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయి.