రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంత్రి కేటీఆర్ సొంత జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కలెక్టరేట్ మరోసారి నీట మునిగింది. చిన్న వానకే మోకాల్లోతు నీళ్లు నిలిచే కలెక్టరేట్ కార్యాలయం… ఈ సారి భారీ వరదలో చిక్కుకుపోయింది. సిరిసిల్ల పట్టణంలో చాలా కాలనీల్లోకి నీరు చేరింది.
అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో బిజీగా ఉన్న కలెక్టర్ అనురాగ్ జయంతి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధికారిక వాహనాలు ఆ వరద నుండి బయటపడేలా లేకపోవటంతో… చివరకు ఓ ట్రాక్టర్ సహయంతో బయటకు వచ్చారు. కలెక్టర్ ఆయన సిబ్బంది అంతా ట్రాక్టర్ తెప్పించుకొని ఆ వరద నీటి నుండి బయట పడ్డారు. ట్రాక్టర్ లో వస్తూ కలెక్టర్ కార్యాలయం అంతా ఎలా వరదలో ఉందో గమనించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలను ట్రాక్టర్ పైనే కలియ తిరిగి… వరద నీరు నిలవకుండా పలు సూచనలు చెప్పారు.