తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వాన బీభత్సంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారాయి. చెరువులలోకి వరద నీరు బాగా చేరుతుండటంతో చెరువులు, కుంటలు నిండీ మత్తడి దుముకుతున్నాయి. మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
శనివారం కురిసిన వర్షంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి. మల్హర్ మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానేరు, గోదావరి నదుల వరద ఉధృతితో అన్నారం బ్యారేజి గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల సంగమంతో వరద మేడిగడ్డ ప్రాజెక్టులోకి వరద ఉధృతంగా వస్తోంది. ఫలితంగా మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి వదులుతున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజ్ 4 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు అధికారులు. ఇన్ ఫ్లో 3 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3 వేల క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.83 టీఎంసీపలు కాగా ప్రస్తుత నీటి నిలువ 4.325 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కు 97 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తుతోంది. దీంతో 35 గేట్లు ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కొమురం భీమ్ జిల్లా వట్టి వాగు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుతం 238.200 మీటర్ల వరకు వరద నీరు చేరింది. ఇన్ ఫ్లో 2 వేల 405 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2 వేల 405 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో జోరువానలు కొడుతున్నాయి. దీంతో రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. అటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగుల వరకు వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 8 వేల 6 వందల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో ఒక వెయ్యి 102 క్యూ సెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 251.58 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 275.58 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 640.30 అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.28 టీఎంసీల నీరు ఉంది.