- బీఆర్ఎస్ పై రాజకీయ ప్రముఖుల అభిప్రాయ సేకరణ
- కలిసొచ్చే పార్టీలు.. సెలబ్రిటీలతో కేసీఆర్ మంతనాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కోసం శరవేగంగా పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా పార్టీ పేరు విషయంలో.. భారతీయ రాష్ట్ర సమితా, భారత రాజ్య సమితా, భారత నిర్మాణ సమితా.. అనే పేర్ల విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జాతీయ కార్యవర్గం కూర్పు కోసం మేథావులతో సమాలోచనలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఐక్యత తేవడం ద్వారా బిజెపిని ఢీ కొట్టడమే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, సన్నిహితులతో కీలక మంతనాలు జరుపుతూ.. BRS నిర్మాణంపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నిర్ణయంలో సక్సెస్ అవుతారా..? బీఆర్ఎస్ కు అనుకూల మద్దతు లభిస్తుందా..? అందుకోసం విపక్ష పార్టీలు సహకరిస్తాయా..? అనే చర్చ ప్రస్తుత రాజకీయాల్లో ఊపందుకుంది. మరోవైపు థర్డ్ ఫ్రంట్ తీరుగానే బీఆర్ఎస్ బొక్కాబోర్లా పడుతుందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
కేసీఆర్ జాతీయ పార్టీకి సినీ గ్లామర్ ను ఉపయోగించుకునేలా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా జాతీయపార్టీ ఆలోచన వెనక కారణాలను శ్రేణులద్వారా గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి వారితోనూ కేసీఆర్ చర్చలు చేసారు. బీజేపీ అమలు చేస్తున్న విధానాల కారణంగా దేశానికి జరిగే నష్టం జరుగుతుందనే వాదనను మరింత ప్రజలకు వివరించాలని కోరారు. భారతీయ రాష్ట్ర సమితి పేరు పైనా పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించేలా గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంత మంది నేతల పేర్లను పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఆయనతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు, జాతీయ కార్యవర్గం వంటి అంశాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కూడా విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు భారతీయ రాష్ట్ర సమితి పేరుపై కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తన పార్టీ విధి విధానాలు.. అజెండా గురించి ఈ నెల 21 లేదా 22న జరిగే పార్టీ విస్తృత స్థాయి భేటీలో నేతలకు సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.