– గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ఆరోగ్య సమస్యలు
– సాయన్న మృతితో మిగిలిన వారిపై ఆరా?
– ఆరోగ్య సమస్యలతో నగరంలోనే ముగ్గురు నేతలు
– వారసులను ప్రొత్సహించినా ఎదగడం కష్టమేనా?
– మాస్, వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నేతలకు వల?
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఇంకొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఈసారి ప్రతిష్టాత్మకం. ముచ్చటగా మూడోసారి గెలవాలని కేసీఆర్ వ్యూహాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో బీఆర్ఎస్ పార్టీలో ఓ చర్చ జరుగుతోంది. అనారోగ్య సమస్యలతో ఉన్న నేతల లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో ఈ అంశం కూడా దృష్టిలో పెట్టుకునే ఛాన్స్ ఉందంటున్నారు. 2020లో సోలిపేట రామలింగారెడ్డి (58), నోముల నర్సింహయ్య (64) బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాక చనిపోయారు. తాజాగా సాయన్న మరణించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్స్ ఈ పాయింట్ ని కూడా బేస్ చేసుకోవాల్సిన దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ములుగు జిల్లాలో మాజీ మంత్రి చందులాల్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ అనారోగ్యంతో తిరగలేకపోయారు. ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల హెల్త్ కార్డు అలానే కనిపిస్తోంది. కేసీఆర్ మైలేజ్ తో గెలిచినా ఆ తర్వాత పబ్లిక్ లో తిరగలేక అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు. కార్యక్రమాలు అన్నీ వారసులకు, ప్రైవేట్ అసిస్టెంట్స్ కి అప్పగిస్తున్నారు కానీ, పార్టీ అనుచరులను, మాస్ లీడర్లను తయారు చేయలేకపోతున్నారు. ఎవరైనా ముందడుగు వేసినా వారిపై కేసులు పెట్టించి తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అనారోగ్యంతో ఉన్నా సొంతపార్టీ నేతల ఎదుగుదలకు సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలో నలుగురు
హైదరాబాద్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ, వారంతా బయటపడటం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు ఉంటే అతి బలవంతంగా వచ్చి హాజరవుతున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ని కిడ్నీ సమస్య వెంటాడుతోంది. ఈయన కుమారుడు ముఠా జయసింహా అన్నీ తానై చూసుకుంటున్నారు. సాయన్న మృతికి ముందు తన కూతురు, బీఆర్ఎస్ కార్పొరేటర్ లాస్య నందిత తెర వెనుక అంతా నడిపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి మూడేళ్ల క్రితం బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చింది. 8 నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. రాజకీయంగా పార్టీలో ఎవరినీ ఎదగనివ్వకుండా అన్నీ తానై చూసుకుంటారని దానంపై ఆరోపణలు ఉన్నాయి. విజయారెడ్డికి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందేమోనని ఆరోగ్యం కుదటపడగానే ప్రతీ కార్యక్రమంలో చెక్ పెట్టారు. దీనికి తోడుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కార్పొరేటర్ గా గెలిచినా మేయర్ లేదా డిఫ్యూటీ మేయర్ ఇస్తే తరువాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమోనని ఆదిలోనే బ్రేక్ వేశారు. 2001 నుంచి ఉద్యమంలో ఉన్న మన్నే గోవర్ధన్ రెడ్డి భార్య కవిత ఎప్పుడైనా ఉత్సాహం చూపించినా తొక్కిపడేస్తున్నారు.
ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి కూడా ఆరోగ్యం సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. మైల్డ్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో 15 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఈ విషయం పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అనుచరులు చెబుతున్నారు. దీనిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా జనవరి 26న రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొని వెంటనే వెళ్లిపోయారు. నియోజకవర్గంలో కొత్త లీడర్స్ ని ఈయన దరి చేరనివ్వడం లేదనే టాక్ ఉంది. కార్పొరేటర్లను ఆ ఏరియాకే పరిమితం చేస్తున్నారట. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కి ఎమ్మెల్యేకు నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. మాస్ గా ఎదిగేందుకు ఒకరిద్దరు కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ఆయా డివిజన్ తో పాటు మిగతా వాటిలో పరిచయాలు పెంచుకుంటున్నారు. అయితే.. ఇవన్నీ గోపీనాథ్ కి నచ్చడం లేదు. అందుకే, లోకల్ గా మరెవరికీ ఛాన్స్ ఇవ్వడం లేదట. శ్రీధర్ రెడ్డికి లేదా యూసఫ్ గూడ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి లాంటి వారిని కనిపించకుండా చేస్తున్నారని పార్టీలోని నాయకులు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల నాటికి బీజేపీ నేతల మత విద్వేషాల టెన్షన్ వీరందరూ తట్టుకుంటారా? ఆరోగ్య సమస్యలతో ఎంతవరకు నెట్టుకొస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
స్థానిక నేతల కెపాసిటీ పై సర్వేలు
బీఆర్ఎస్ లో యువ నేతలకు అవకాశాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా వారసులు 70 శాతం సక్సెస్ కాలేకపోయారు. ఆర్థికంగా బలంగా ఉండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత అవకాశాలు వస్తాయనే మెసేజ్ తీసుకెళ్తున్నారు. గతంలో ఇతర పార్టీల బలమైన నేతల మీద పెట్టిన ఫోకస్.. ఇప్పుడు సొంతపార్టీలోని నవతరానికి, ఇతర పార్టీల్లోని రెండో క్యాడర్ నేతలకు అవకాశం వచ్చేలా ఉంటుందని చెప్పడానికి కొన్ని నామినేటేడ్ పదవులు ఇవ్వనున్నారట. దీనికితోడు నేతల ఆరోగ్య సర్వే కూడా అవసరమని భావిస్తున్నట్టు సమాచారం.