ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు హైకోర్టులో ఊరట లభించింది. దొరండ ట్రెజరీ కుంభకోణం కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గతంలో డొరండ ట్రెజరీ కేసులో ఆయనకు సీబీఐ స్పెషల్ కోర్టు ఐదేండ్ల శిక్ష విధించింది. అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.
డొరండ ట్రెజరీ కేసులో శిక్షను నిలిపివేయాలని తాము పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు స్వీకరించిందని లాలు తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు లాలుకు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు.
ఈ కేసులో తన ఐదేళ్ల శిక్షలో సగం ఇప్పటికే అనుభవించారని తాము కోర్టుకు విన్నవించినట్టు చెప్పారు. లాలు ఇప్పటికే 41 నెలల జైలు శిక్ష అనుభవించాడని వెల్లడించారు.
దీనికి సంబంధించి ట్రయల్ కోర్టు సర్టిఫైడ్ కాపీని హైకోర్టుకు తాము సమర్పించామని పేర్కొన్నారు. ఈ కేసులో తమ వాదనలు విన్న కోర్టు లాలుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపిందన్నారు.