ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అని.. ఏం కావాలన్నా ఇంటి నుంచే ఆన్లైన్ యాప్‌ల్లోనే ఆర్డరు పెట్టేస్తున్నారు. బట్టలు, వస్తువులు, నిత్యవసర సరుకులు చివరికి ఫుడ్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వింత ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా బెంగళూరు నుంచి మరో తమషా కథ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి స్విగ్గీలో కాఫీ ఆర్డర్ ఇస్తే.. డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలుసా? తాను డెలివరీ చేయకుండా.. మరో యాప్ ద్వారా ఇంకో డెలివరీ బాయ్‌ని నియమించి.. కాఫీని డెలివరీ చేయించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ నుంచి కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఓ డెలివరీ బాయ్‌కి వెళ్లింది. అతడు కాఫీని పికప్ చేసుకునేందుకు సీసీడీ అవుట్‌లెట్‌కు వెళ్లాడు. కాఫీ తీసుకున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ అతనికి బద్ధకమో.. లేక ఒక్క చిన్న డెలివరీ కోసం వినియోగదారుడి లొకేషన్ వరకు ఏం వెళ్ళాలి అనుకున్నాడో.. టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు.
‘డుంజో’ అనే మరో యాప్ ద్వారా ఆ కాఫీని సదరు వినియోగదారుడికి పార్సెల్ చేశాడు. అనంతరం వినియోగదారుడికి కాల్ చేసిన స్విగ్గి డెలివరీ బాయ్.. ‘సార్ మీ పార్సెల్‌ను డుంజోలో పంపించాను.. నాకు మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశాడు. అనంతరం డుంజో డెలివరీ బాయ్ ఆ ఆర్డర్ తీసుకెళ్లి కస్టమర్‌కు అందజేశాడు.
కాఫీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తన స్నేహితుడితో దీని గురించి వాట్సాప్‌లో చర్చించగా.. ఆ స్క్రీన్ షాట్‌ను ఓంకార్ జోషి అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు.. స్విగ్గీ డెలివరీ బాయ్ అతితెలివిని ప్రశంసిస్తున్నారు. మరికొందరు బెంగళూరులో వ్యవహారాలు ఇలా పీక్స్‌లోనే ఉంటాయి మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Hello @peakbengaluru, the latest Bangalore update is broken. pic.twitter.com/GlDRJgdreh
— Omkar Joshi (@omkar__joshi) May 4, 2022