- సిద్దిపేట గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్
- ఎన్‌ఎస్‌యూఐ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం
- బల్మూరి వెంకట్ అరెస్టుపై రేవంత్ ఫైర్
సిద్దిపేట మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 128 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అయితే అనారోగ్యం పాలైన విషయం బయటికి పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారనే విషయం బయటకు తెలియడంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు గురుకుల పాఠశాలకు వెళ్తుండగా పోలీసులతో వాగ్వాదం తలెత్తింది.
మరోవైపు బాధిత విద్యార్థుల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. విద్యార్థినులను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల వార్డెన్, కిచెన్ సిబ్బంది విధుల నుంచి తొలగించారు.
అయితే, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన విషయంలో ఎన్ఎస్ యూఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నెలకొన్నాయని.. కాని, విద్యార్థుల ఆరోగ్యంపై పట్టింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్వవహరిస్తోందంటూ మండిపడ్డారు.
అధికారులు, ప్రభుత్వ అసమర్థను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. రామునిపట్ల వద్ద బల్మూరి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు నిలువరించారు. పోలీసులు, ఎన్‌ఎస్‌యూఐ నేతల మధ్య వాగ్వాదంతో బల్మూరి వెంకట్ కు గాయాలయ్యాయి. పోలీసుల వైఖరికి నిరసనగా పాఠశాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు.
కాగా బల్మూరి వెంకట్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాజియన్ అయ్యి 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం టిఆర్ఎస్ పాలకుల పాశవికత్వమేనన్నారు. టీఆర్ఎస్ పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని రేవంత్ ఫైరయ్యారు.