బంజారాహిల్స్ డ్రగ్స్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు అభిషేక్, అనిల్ ను కష్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. ఐదు రోజుల కష్టడీ కోసం పిటిషన్ వేశారు బంజారాహిల్స్ పోలీసులు. అటు నిందితులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేయనుంది న్యాయస్థానం.
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరపగా డ్రగ్స్ బయటపడ్డాయి. ఇందులో మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. సోదాలు జరిపిన సమయంలో 145 మంది ఉండగా.. వారి వివరాలు సేకరించి పంపించేశారు పోలీసులు.
పబ్ లోని సీసీ కెమెరాల దృశ్యాలను నిశితంగా పరిశీలించి అందరి వివరాలు సేకరించారు. పబ్ కు వచ్చిన వాళ్లలో అందరూ ఒకరి ఆహ్వానం మేరకే వచ్చారా..? లేదంటే బృందాలుగా వచ్చారా..? అనే వివరాలను సేకరిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లందరి వివరాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.