– చిత్రహింసలు పెట్టిన కన్నకొడుకులు
– ముద్ద అన్నం కోసం అలమటిస్తున్న తల్లి
– నడిరోడ్డుపై వదిలేసిన పుత్రరత్నాలు
– చేసేదిలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
– కంటతడి పెట్టిస్తున్న ఓ తల్లి కన్నీటి గాథ
నవ మాసాలు మోసింది.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది. రెక్కలు ముక్కలు చేసి ప్రభుత్వోద్యోగాల్లో సెటిల్ అయ్యేట్టు ప్రయోజకులను చేసింది. పెళ్ళిళ్లు చేసింది. కాని ఇన్ రిటర్న్ లో మాత్రం ఆ తల్లికి కొడుకులు ఇచ్చిన గిఫ్ట్..ఆకలి ఇంకా నడిరోడ్డు. ఇది మారుతున్న కాలంతో పాటు మారుతున్న బంధాలకు నిలువెత్తు నిదర్శనం.
దీంతో నడిరోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న ఆ తల్లి మాత్రం చేసేది లేక..న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ ప్రాధాయప్డడా తన కొడుకులు అన్నం పెట్టడం లేదని ఖాకీల ముందు వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల ముందు వేడుకోవడం చూస్తుంటే..ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది. చూసినోళ్లకే ఇలా ఉంటే.. ఆకలితో నకనకలాడిపోతున్న ఆ వృద్ద తల్లిని నడిరోడ్డుపై కన్న కొడుకులకు ఎలా వదిలి వెళ్లిపోవాలనిపించిందో అర్థం కావడం లేదు. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్నతల్లైనా.. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారుతున్న ఈ రోజుల్లో.. మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో తెలియజేసే ఈ సంఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకిన పల్లిలో వెంకటనర్సమ్మ అనే వృద్దురాలి కన్నీటి గాథ ఇది. ఆమెకు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలున్నారు. ఆరుగురు పిల్లలను కని,పోషించి,ప్రయోజకులను చేసిన ఆమెకు చివరికి నడిరోడ్డయే గతి అయింది. వయసురీత్యా పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారు ఆమె కొడుకులు. కూతుళ్లతో కూడా కలవనివ్వడం లేదు. ఆకలి కేకలతో చేతులెత్తి ప్రాధేయపడ్డా.. అన్నం పెట్టేందుకు కనికరం లేని కసాయి కొడుకులకు మనస్సు రాలేదు. ఆమె ఆలనాపాలనా చూడడం లేదు.
జీవాన్ని,జీవితాన్ని ఇచ్చిన తల్లి పట్ల అమానుషంగా వ్యహరించారు. దీంతో ఆ తల్లి ఏం చేయాలో తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించింది. వాళ్ల ముందు తన గోడును వెళ్లేసుకుంది. పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. కన్న కూతళ్లతో కూడా కలవనివ్వడం లేదని బాధను చెప్పుకుంది. కన్న కొడుకులు పట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది.