ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్నిసందర్శించుకుని తమ భక్తిప్రపత్తులు చాటుకుంది టీమిండియా క్రికెట్ జట్టు. మహాకాళేశ్వరుని ఆశీస్సులు తీసుకున్న క్రికెటర్లు ఆలయంలో తెల్లవారు ఝామున ప్రత్యేకంగా నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి శివపూజలో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజలు నిర్వహించిన వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది. ఇండోర్ లో మంగళవారం చివరిదైన మూడో వన్డే జరుగనుంది.
ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కోసం పూజలు నిర్వహించినట్లు టీమిండియా స్టార్ బ్యాట్స్ మేన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని కాళేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. డిసెంబర్ 30న రిషబ్ పంత్ కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు పంత్. పంత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని ఆకాంక్షించారు. అతని పునరాగమనం మాకు చాలా ముఖ్యమని, ఇప్పటికే న్యూజిలాండ్ తో సిరీస్ గెలిచామని..వారితో జరిగే చివరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.
శనివారం రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. వరసగా ఏడో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.