రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో ఏదోరకంగా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. దీంతో ట్రెండ్ అవ్వాలని నేటి యువతరం వింత వింత పనులను చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు బాలురు చేసిన పని పలు విమర్శలకు దారితీసింది.
బెంగాల్ మేదినీపుర్కు చెందిన అర్పణ్ బెనర్జీ(15) అనే బాలుడిపై 10-12 మంది కలిసి దాడి చేశారు. అతడి చొక్కా చించేసి, సెల్లో టేపుతో చేతులు కట్టేశారు. ముఖంపై కోడిగుడ్లు, రంగు కొట్టారు. వీధుల్లో ఊరేగించారు. ఇదంతా చూసినవారు అతడేదో తప్పు చేశాడని, అందుకే ఇలా శిక్ష విధించారని అనుకున్నారు.
తీరా ఆరా తీస్తే తెలిసి అంతా షాక్ అయ్యారు. బాలుడి బర్త్‌డే సందర్భంగా అతడి స్నేహితులు ఇలా చేశారట. సెలబ్రేషన్స్‌లో సరికొత్త ట్రెండ్ అని ఆ బాలలు చెప్పారు. తమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని, బర్త్‌డే బాయ్ కల నెరవేరిందని అన్నారు.
అయితే, సోషల్ మీడియా వల్ల నేటితరం పాడవుతున్నారని, రకరకాల పిచ్చి చేష్టలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇలా వీడియోలు చేస్తూ ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తుండటం ఒక్కోసారి ఫన్నీగా అనిపించినా.. ఒక్కోసారి వెగటు పుట్టిస్తాయని విమర్శలు చేస్తున్నారు.