విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్, రాజ్యసభ ప్రతి పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీ ఛీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న రాజ్యసభ సెక్రటరీ పీసీ మోడీకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను యశ్వంత్ సిన్హా సమర్పించారు.
మరో వైపు బీజేపీయేతర పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చాలు నామినేషన్ కార్యక్రమానికి తమ ప్రతినిధులను పంపక పోవడం గమనార్హం. ఇక బీజేపీయేతర పార్టీలైన బీఎస్పీ, బిజూ జనతాదళ్ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ మద్దతును తెలిపాయి.