ఓవైపు ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు.. ఆడవాళ్లు మీకు జోహార్లు అని దేశం నీరాజనాలు పడుతుంటే.. ఇంకోవైపు వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రంగాల్లో మహిళలు మగవారికేం తక్కువ కాదు అని నిరూపిస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్లు చేయిస్తున్నారు. మగపిల్లాడి కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. ముంబైలో తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది. మగ పిల్లాడు కావాలని భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించాడు ఓ భర్త.
వారసుడి కోసం తాను కూడా చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్ధారణ తదితర అంశాలకు భారత్ లో అనుమతి లేకపోవడంతో భార్యను బ్యాంకాక్ తీసుకెళ్లి మరీ పరీక్షలు చేయించాడు. 8 అబార్షన్లతో పాటు దాదాపు 15వందలకు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. విపరీతంగా ఇంజెక్షన్లు చేయడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చివరకు భర్త టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.